ఏపీలో ఇక అంతా నీళ్ల ప్ర‌యాణ‌మే..

ఏపీలో జల రవాణాను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. 2018 డిసెంబ‌ర్ నాటికి ప్ర‌భుత్వం సాగ‌ర‌మాల ప్రాజెక్టు తొలిద‌శ‌ను పూర్తి చేయాల‌ని భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐదు ఓడ రేవుల‌ను అభివృద్ధి చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టులో వస్తు రవాణాతో పాటు ప్రయాణికుల సౌకర్యార్ధం అనేక టెర్మినల్స్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందులో భాగంగా ఐదు ఓడరేవులను అభివృద్ధి చేయనున్నారు. ఇక సాగ‌రమాల ప్రాజెక్టు కోసం ప్ర‌భుత్వం 1,30,672 కోట్ల‌తో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు మంజూరు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సాగర తీరం జల రవాణాకు కేంద్ర బిందువు కానున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో వ‌స్తువుల ర‌వాణాకు ఆకాశమార్గంలో ప్ర‌యాణం భారీగా ఖ‌ర్చుతో కూడుకుంది. దీంతో ఇక్క‌డ త్వ‌ర‌గా జ‌ల‌ర‌వాణాను అభివృద్ధి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందుకోసం తీరం వెంట మొత్తం ఐదు ఓడ‌రేవుల్లో కార్య‌క‌లాపాల‌ను విస్తృతం చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టులో కొత్తగా మేఘవరం, నక్కపల్లి, నర్సాపూర్‌, దుగరాజుపట్నంలో ఓడరేవులను నెలకొల్పుతారు.

ఇక విశాఖలో భారీ ఓడరేవులో ఇప్పటికే సేవలను విస్తరించగా, భావనపాడు, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల అభివృద్ది కోసం చర్యలు చేపట్టారు. కృష్ణా, గోదావరి నదులపై మొత్తం 315 కిలోమీటర్ల మేర జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి కేంద్రం రూ.7015 కోట్లు కేటాయించింది. మొదటి విడతలో ముక్త్యాల-విజయవాడలో 82 కిలోమీటర్ల మేర 7 టెర్మినల్స్‌ నిర్మించనున్నారు. అలాగే రెండో విడత మార్గంలో విజయవాడ-కాకినాడ మధ్య 233 కిలోమీటర్ల మేర టెర్మినల్స్‌ నిర్మిస్తారు. ఇక ఈ పనుల కోసం 1730 ఎకరాలలో భూసేకరణ చేపట్టాల్సి ఉంది.

జలరవాణాలో సరుకు సరఫరాతో పాటు.. ప్రయాణికుల రవాణాకు అనువుగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ముక్త్యాల, హరిశ్చంద్రాపురం, ఇబ్రహీంపట్నం, ప్రకాశం బ్యారేజి వద్ద టెర్మినల్‌ పాయింట్లను సరుకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కోసం ఉపయోగించనున్నారు. వేదాద్రి, అమరావతి, భవానీపురం, దుర్గాఘాట్‌ వద్ద ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా టెర్మినల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ప్రజలకు ఉపయోగకరమైన ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.