సినీ జగత్తులో ఎన్టీఆర్ విశ్వరూపం..!

నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, పామర్రులోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ ఎన్టీఆర్ తల్లి దండ్రులు. మొదట కృష్ణ అని పేరుపట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో అదే నామకరణంగా చేశారు. తర్వాత అది తారక రామారావుగా మారింది. 20 ఏళ్ళ వయసులోనే మేనమామ కూతురు బసవ రామతారకమ్మను వివాహంమాడిన ఎన్టీఆర్ గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల కేంద్రంగా నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల నాగభూషణం, కె.వి.ఎస్.శర్మతో ఎన్నో నాటకాలు ఆడారు. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. సుభాష్ చంద్రబోసు విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయనకు బహుమానంగా ఇచ్చారు.

అప్పట్లో ఎన్టీఆర్ కు సినిమా నటుడుగా రాణించాలన్న కోరిక బలంగా ఉండేది. ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే ఆయనను మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో హీరోగా ఎంపిక చేసాడు. ఈ సినిమా ఆలస్యం కావడంతో ముందుగా మనదేశం సినిమాలో నటించాడు. దాంతో ఎన్టీఆర్ మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఎన్టీఆర్ పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాద్ షావుకారు సినిమా కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ సినీ రంగంలో దూసుకుపోయారు. అసలు తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ జీవితం సువర్ణాక్షరాలతో లిఖించదగింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సుమారు 302 చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ అత్యంత ప్రతిభతో ఎన్నో పాత్రలకు జీవం పోయడమే కాకుండా, పలు చిత్రాలను నిర్మించారు. మరెన్నో చిత్రాలకు దర్శకత్వంవహించారు. ఇంతటి మహానటుడైన ఎన్టీరామారవు అటు పౌరాణిక జానపద చిత్రాల్లోనే కాకుండా సాంఘిక, చారిత్రక చిత్రాల్లో కూడా నటించి అన్నిరంగాల్లోనూ నటించిన ఏకైక నటుడుగా చరిత్రలో చిరకీర్తి పొందాడు. ఎన్టీఆర్ ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయన చిత్రపటాలను దేవుడి మందిరంలో పెట్టుకొని పూజించారు.

1956లో విడుదలయిన మాయాబజార్‌ ఒక వెండితెర అద్భుతం. 1959లో ఎవిఎమ్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. 1951లో కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన జానపద చిత్రం పాతాళభైరవి. ఈ సినిమా 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో, ఎత్తయిన రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంద్రదేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. జానపదాలలో అద్భుత చిత్రంగా చెప్పుకోదగింది జగదేక వీరుని కథ. ఇంకా ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. గుడి గంటలు, రక్తసంబంధం, రాముడు బీముడు వంటి చిత్రాలలో ఎన్టీఆర్ నట రూపాన్ని చూసి ప్రేక్షకులు మైమరచి పోయారు. అంతేకాకుండా ఎన్టీఆర్ నటించిన చారిత్రక చిత్రాల్లో పల్నాటి యుద్ధం, బాలనాగమ్మ, పోతూలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటివి గొప్ప విజయాలను అందుకున్నాయి.

అలాగే నందమూరి తారక రామారావుకి ‘దాన వీర శూర కర్ణ’, ‘మాయాబజార్‌’, ‘పాతాళ భైరవి’, ‘మల్లీశ్వరి’, ‘అడవిరాముడు’, ‘వేటగాడు’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’ తదితర చిత్రాలు మంచి నటుడిగా…. ‘సీతారామ కళ్యాణం’, ‘గులేబకావళి కథ’, ‘శ్రీ కృష్ణ పాండవీయం’, ‘వరకట్నం’, ‘తల్లా పెల్లామా’, ‘దానవీర శూరకర్ణ’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘శ్రీమద్విరాట పర్వం’, ‘శ్రీమద్విరాట్‌ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి చిత్రాలు ఎన్టీఆర్ ను దర్శకుడిగా మంచి కీర్తిని సాధించి పెట్టాయి. ఇక ‘శ్రీనాథ కవి సార్వభౌమ’, ‘శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం’, ‘చండశాసనుడు’ వంటి చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా…. ‘శ్రీ కృష్ణ పాండవీయం’, ‘ఉమ్మడి కుటుంబం’, ‘వరకట్నం’, ‘తల్లా పెళ్ళామా’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘తాతమ్మకల’, ‘వేములవాడ భీమకవి’, ‘దాన వీర శూర కర్ణ’, ‘చాణక్య చంద్రగుప్త’, ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలీ’, ‘శ్రీమద్విరాటపర్వం’, ‘శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం’, ‘చండశాసనుడు’, ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సామ్రాట్‌ అశోక్‌’ వంటి తదితర చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయిగా ఎన్టీఆర్‌ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నాలుగు దశాబ్దాల ఎన్టీఆర్ సినీ ప్రయాణంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాల్లో నటించారు. ఆయా చిత్రాల్లో నటనకు ప్రేక్షకులు ముగ్ధులై విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఎన్టీఆర్‌ని కొనియాడటం విశేషం.

ఇలా విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా ప్రేక్షకులు అభిమానంగా పిలుచుకునే ఎన్టీఆర్‌ను కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారంతో సముచితంగా గౌరవించింది. ఒక్కమాటలో చెప్పాలంటే సినీ జగత్తులో ఎన్టీఆర్ సృష్టించింది విశ్వరూప నట సాక్షాత్కారమే. ఈరోజు ఎన్టీఆర్ వర్థంతి సందర్బంగా వారికి నివాళి ఈ వ్యాసం.