దేశంలోనే ఫస్ట్ టైమ్.. మరోసారి సత్తా చాటిన ఏపీ..!

ఆర్థికంగా పేదలమే కానీ.. ఆలోచనల్లో కాదని ఆంధ్రప్రదేశ్ మరోసారి నిరూపించింది. ఆర్థిక ఇబ్బందులు.. విభజన సమస్యలు ఉన్నా.. ఏపీ అనేక విషయాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. టెక్నాలజీ వినియోగంలోనూ.. పౌరసేవల విషయంలోనూ.. పెట్టుబడుల ఆకర్షణలోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలోని పలు రాష్ట్రాలకు ఓ రోల్ మోడల్ గా నిలుస్తోంది. ఇప్పటికే విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపింది. అదేమిటంటే.. దేశంలో తొలిసారిగా పూర్తి స్ధాయి సౌర విద్యుత్తు సబ్ స్టేషన్లు ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతోందట. దీని ద్వారా వ్యవసాయానికి 24 గంటలూ ఈ సబ్ స్టేషన్ల పరిధిలో అందించే విధంగా రంగం సిద్దం చేశారు. తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్ధ పరిధిలోని ఒక సబ్ స్టేషన్, దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్ధ పరిధిలో ఒక సబ్ స్టేషన్ లను ఈ ప్రయోగం కోసం ఎంపిక చేశారట. త్వరలోనే దీన్ని అమలులోకి తీసుకొస్తారట.

దేశంలో 24 గంటల విద్యుత్ అందించే రాష్ట్రాలు ఉన్నాయి. ఇటీవలే తెలంగాణ సర్కారు తాము 24 గంటల కరంట్ ఇస్తున్నామని ప్రకటంచారు. కానీ ఇలా సౌరవిద్యుత్ తో 24గంటల విద్యుత్ ఇచ్చే ఆలోచన మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే చేసింది. ఈ వినూత్న ప్రయోగానికి విజయనగరం జిల్లా మక్కువను నెల్లూరు జిల్లా కసుమూరులను ఎంపిక చేశారు. ఒక్కో సబ్ స్టేషన్ కోసం 25 ఎకరాల మేర స్ధలంలో 5మెగా వాట్ల సోలార్ పలకల్ని ఏర్పాటు చేస్తారు.

రెండు చోట్లా ఒక మెగా వాట్ సామర్ధ్యం గల బ్యాటరీ బ్యాకప్ నెలకొల్పుతారు. రాత్రి సమయంలో ఈ విద్యుత్తు సరఫరా అవుతుంది. ఒక్కో సబ్ స్టేషన్ ఏర్పాటుకు పది కోట్ల రూపాయిల చొప్పున వ్యయం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో గ్రీన్ కో సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ వాడకంపై ఆందోళన పెరుగుతోంది. బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పిత్తి ద్వారా వాతావరణ కాలుష్యం భారీగా ఉంటోంది. ఇలాంటి సంప్రదాయేతర వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం పర్యావరణానికి ఎనలేని మేలు చేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారును అభినందించకుండా ఉండలేం కదా..!