మీ ఆధార్ ఎప్పుడు ఎక్కడ వాడారో ఇలా తెలుసుకోండి!

ఆధార్ కార్డు.. ఇప్పుడు అన్నింటికీ ఇదే దిక్కు. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు.. ఇలా దేనికైనా ఆధార్‌నే అడుగుతున్నారు. ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఇప్పుడు ఆధార్‌ను మించింది లేదు. దీంతో మనం కూడా ప్రతిదానికీ ఆధార్‌నే ఇస్తున్నాం. ఇందులో మన ఐరిస్, ఫింగర్ ప్రింట్స్, అడ్రెస్‌లాంటి డిటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది దుర్వినియోగం అవుతున్నదన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ ఆధార్‌ను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారో తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? ఆధార్ కార్డు జారీ చేసే యూఏడీఏఐ వెబ్‌సైట్ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది. దీనికోసం ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది..

– యూఐడీఏఐ ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ పేజ్‌కు వెళ్లాలి (https://resident.uidai.gov.in/notification-aadhaar)
– మీ ఆధార్ నంబర్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి
– జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
– తర్వాతి పేజీలో మీకు ఎలాంటి సమాచారం కావాలో కోరుతూ కొన్ని ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతాయి. బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్‌లాంటివి. ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు.
– చివరి కాలమ్‌లో ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి.
– మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పని కోసం ఆధార్‌ను ఇచ్చారన్న వివరాలు వస్తాయి. అయితే ఇందులో మీ ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు.